గోమాత
పురాణాల ప్రకారం, గోవులో సకల దేవతలు నివసిస్తారు, గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది. ఆవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం (పంచగవ్యాలు) ఔషధ గుణాలను కలిగి ఉంటాయి, పూజా కార్యక్రమాలలో వీటిని ఉపయోగిస్తారు.
ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక, పవిత్ర గోమాత. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత. చతుర్వేదాలలోనే కాక, హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత, రామాయణ భాగవతాది పవిత్రగ్రంథాలలోనూ, గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది.
పూర్వము విశ్వకర్మ, గొప్ప తపస్సుకు పూనుకున్నాడు. అమృత రూపిణి, కామరూపి అయిన సురభి అనే కన్యను, మానస పుత్రికగా సృష్టించాడు. ఆమెతో పాటు, మహా తేజోవంతుడైన ఒక పురుషుడిని కూడా సృష్టించాడు. ఆ పురుషుడు, ఆ కన్యను చూసి మోహించి, ఆమె కొరకు పరితపించసాగాడు. అది చూసిన బ్రహ్మ, “మార్తోభవ” అంటే, నీ పరితాపము ఉపశమించుగాక, అని దీవించాడు. అతడికి మార్తాండుడని పేరు పెట్టి, సురభిని ఇచ్చి వివాహము జరిపించి, “మీ ఇరువురికీ పుట్టిన సంతానం, యజ్ఞయాగాదులకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సమకూరుస్తాయి” అని చెప్పాడు. అలా వారిరువురికీ, గోవులు సంతానంగా జన్మించాయి. సురభీ మార్తాండులకు, పదకొండు మంది సంతానం ఉద్భవించారు. వారే, బ్రాహ్మణులకు మూల పురుషులు. వారే ఏకాదశ రుద్రులు. వారి పేర్లు, అజపాదుడు, అహిర్బుధ్న్యుడు, త్రయంబకుడు, వృషాకపి, శంభుడు, కాపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. ఈ ఏకాదశరుద్రులను లోకమంతా పూజించారు. ఏకాదశ రుద్రుల తరువాత, గో సమూహం పుట్టింది. ఆ ఆవుల ముఖంలో, కొమ్ములలో, నాలుకలో ఇంద్రుడూ.. మలద్వారము, మూత్రములో వాయుదేవుడూ.. మూపురంలో శివుడూ.. పాదాలలో దేవతలూ.. కడుపులో అగ్నిదేవుడూ.. పాల పొదుగులో సరస్వతీ.. పేడలో లక్ష్మీదేవీ.. పంచితంలో కీర్తీ.. రక్తంలో చంద్రుడూ కొలువై ఉన్నారు. గోవు హృదయంలో భగుడు అనే దేవతా, పాలలో బ్రహ్మదేవుడూ, వెంట్రుకలలో అనుష్ఠానములూ, తోకలో యమధర్మరాజూ, కన్నులలో సూర్యుడూ, చర్మములో తపస్సూ, తేజమూ అధిష్ఠాన దేవతలుగా ఉన్నారు. ఆవు కాళ్ళలో ఉన్న కీళ్ళలో, సిద్ధులు కొలువై ఉన్నారు. సమస్త దేవతలకూ ఆలవాలమైన గోవు మాహాత్మ్యమును, ఎన్ని విధాలుగా వర్ణించినా పరిపూర్ణము కాదు. వాటిలో కపిల గోవు మరింత పూజనీయమైనది.
ఒకనాడు ఆవులన్నీ హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతోంది. ఆ పాల నురగ గాలికి ఎగిరి, అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి మూడవ కన్ను తెరచి, ఆ ఆవులను చూశాడు. ఆ ఆవులన్నీ ఆ కోపాగ్ని వేడికి, ఎర్రగా అయిపోయాయి. ఆవులన్నీ బెదిరి, తలోదిక్కుకు పారి పోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి, “మహేశా! నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా! లేగ దూడల నోటి నుండి వచ్చే నురగ కూడా, అమృత సమానమే కదా! అది ఎంగిలి ఎలా ఔతుంది! గోవు పాలు అమృతమైతే, వాటి నురగ కూడా అమృతమే కదా! దీనికి ఆగ్రహిస్తే ఎలా! వాటిని కరుణించు” అని వేడుకుని, ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి, ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని, ఆవులను ఆ ప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే, బెదిరి పోయిన ఆవులు తిరిగి వచ్చాయి. అప్పుడు శివుడు, “బ్రహ్మదేవా! ఈ గోవులన్నీ నా మూడవ కంటిచూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి, ఇవి అతి శ్రేష్ఠమైనవిగా భావించబడతాయి” అని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు.
సాధారణంగా కపిల గోవులకు చెవులూ, ముక్కు, కళ్ళు, కొమ్ములూ, కపిల వర్ణంలో ఉంటాయి. అలాకాక, ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు. అది కపిల గోవు అని పిలువబడుతుంది. ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే, ఇక దాని మహిమ చెప్పవలసిన అవసరం లేదు. ఆవులు దేవతలతో సమానంగా నేటికీ పూజింపబడుతూ ఉన్నాయి.
ఈ చరాచర జగత్తుకు మూలాధారము గోవు. దేవతలకూ, సిద్ధులకూ, సాధువులకూ గోవు తల్లి వంటిది. బ్రహ్మ పదమును కోరుకునేవాడు, గోవును మనసుతో కానీ, కర్మలతో కానీ, వాక్కుతో కానీ బాధించకూడదు. ఇది బ్రహ్మ వాక్కు. వేదము కూడా గోవులకు పవిత్రతను ఆపాదించింది. ఏ గోవును పూజించి, దేవతలు మానవుల కంటే గొప్ప వాళ్ళయ్యారో, అటువంటి గోవుల కంటే పవిత్రమైనది, ఈ లోకములో ఏముంది! యజ్ఞ యాగములలో గోవులకు ఉన్న పవిత్రత, మరి వేటికీ లేదు. ఉపనిషత్తులన్నీ గో స్వరూపాలే అని, బ్రహ్మదేవుడు స్వయంగా తెలియజేశాడు. గోపూజ పవిత్రమైన యజ్ఞము వంటిది. మానవులు ఎక్కువగా, కపిల గోవులను పూజిస్తారు. వాటిని దానంగా ఇస్తారు. అలా చేయడం వలన, వారి పాపాలన్నీ తొలగి పోతాయి.
గోవు దానం వివరముల కొరకు సంప్రదించగలరు.
