వివాహ పొంతన
వివాహ పొంతన అనగా వధూవర జన్మనక్షత్రములకు మరియు జాతక చక్రములను పరిశీలించి ఇద్దరి వివాహం అయిన తదుపరి దాంపత్య అన్యోన్యత, సుఖ సంతోష అభివృద్ధి, సంతాన అభివృద్ధి అను తదితర విషయముతెలియచేయబడును.వివాహ పొంతన అనేది ప్రస్తుత కాలంలో పంచాంగం లో వధూవర గుణమేళన చక్రం ప్రకారం 18 పాయింట్ల కన్నా ఎక్కువ వచ్చినచో వివాహం చేసుకోవచ్చు అని 18 పాయింట్ల కన్నా తక్కువ వచ్చినచో వివాహం చేసుకోనరాదని చెప్పుచున్నారు.పాయింట్స్ ఎక్కువ వచ్చినను వాళ్ళు జీవితాంతం బాగుంటారని చెప్పలేము.అది అంతా సమంజసం కాదు. పాయింట్స్ ఎలా వచ్చినను ఇరువురి జాతకములను పరిశీలించి తదితర నిర్ణయం తీసుకోవడం మేలు.
ఇంకొక ముఖ్య విషయం కుజ దోషం
సంసారులు కానిదే సర్వేశ్వరులకైనా పరిపూర్ణత లేదు అనేది అర్ధవాక్యం. అటువంటి ముఖ్యమయిన సంసారానికి మూలమయిన వివాహ వ్యవస్థ లో వధూవర జాతక పరిశీలనలో ఎంతటి వారు అయినా భయపడేది “కుజ దోషం” ఏ జాతకము అయినా జన్మ లగ్నాత్తు 2,4,7,8,12 స్థానములలో కుజుడు ఉన్నా లేక ఆ స్థానములను కుజుడు చూసినను కుజదోషం కల్గి అది స్త్రీల యొక్క భర్త భావానికి పురుషుల కళత్ర భావానికి పీడ కల్గిస్తుందని, అలాంటి జాతకులకు వివాహం చేయరాదని, కుజ దోషం లేని వధూ వరులకు మాత్రమే పెండ్లి చేయాలని పెద్దల నిర్ణయం. కాని వధూవరుల జతకములు రెండింటా కుజ దోషం సమతుల్యంగా ఉంటే వివాహం చేయవచ్చు అని శాస్త్రాలు అంగీకరిస్తున్నాయి. అంతే కాకుండా మేష, కర్కాటక, సింహా, వృశ్ఛిక, ధనుర్మీన లగ్నముల జాతకములకు కుజ దోషం వర్తించదు అని శాస్త్రం చెబుతుంది మరియు మేష,వృశ్చికములకు చతుర్ధ కుజుడు, వృషభతులల కు వ్యయ కుజుడు , మిధున కన్యలకు ద్వితీయ కుజుడు, మకర కర్కాటములకు సప్తమ కుజుడు, ధనుర్మీనములకు అష్టమ కుజుడు, కుంభ సింహములకు కుజుడు ఎక్కడ ఉన్ననూ కుజ దోషం లేదని శాస్త్ర నిర్ణయం.